జనతా ఎక్స్ ప్రెస్, 1955

భారతి మాసపత్రిక

తాత్కాలికంగా వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్లా, ఇంతకన్నా పెద్ద ఇల్లు దొరకకా తనూ పక్కింటి పిన్నిగారూ ఈ మధ్య తరగతి వాళ్ళ కాలనీలో వనవాసం చేస్తున్నారు.

తనకి సరికొత్త జాగ్వారు కారు కొనాలని అభిలాష. పిన్నిగారికి ఒక మేడ ప్రస్తుతానికి కొనాలని ఉంది, తాపీగా ఒకటి కట్టించుకోవాలని సంకల్పం. అందులో టెలిఫోను, రేడియో, బొచ్చుకుక్క అవీ ఉంటాయి. అప్పుడే ఆవిడ టెలిఫోనూ రేడియో పెట్టే బల్లల మీద వేసే గుడ్డలు కొనేసి, వాటికి ఎంబ్రాయిడరీ వేసింది. కొనబోయే బొచ్చుకుక్కకి ముచ్చటైన పటకా, గొలుసు కొని అట్టే పెట్టుకుంది. సుందరమ్మ పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో, చూసి చదివి తెలుసుకుంది.

డ్రైవరు వచ్చి తలుపు తీసేదాకా దిగకుండా ఉండటం, దిగినపుడు ముందర ఓ కాలు వయ్యారంగా నేలమీద మోపడం, మోపినప్పుడు కాలి ఆకుజోడు పూర్తిగా తొడుక్కుని ఉండకుండా, బొటనవేలికి సుతారంగా తగిలించి, అరికాలికి, జోడు ఉపరి తలానికి మధ్య కనీసం అరవై డిగ్రీల కోణం ఉండేటట్లు చూసుకుని మరీ దిగడం, తలుపు వేసినప్పుడు చీర చెంగు ఆ సందులో పడేటట్లు వదిలి, ఆపైన ముద్దుగా ముచ్చటగా సన్నంగా చక్కగా 'ఓ 'అని ఇంగ్లీషులో ఆశ్చర్యపడి, నాజూకైన బేజారు నటించడం మొదలైన కార్య కలాపాలన్నీ, సినిమాలకు వెళ్ళినప్పుడు టాక్సీలలో ఎక్కి దిగి నేర్చుకుంది అందమైన సుందరమ్మ.

Image: