
జనతా ఎక్స్ ప్రెస్, 1955
భారతి మాసపత్రిక
తాత్కాలికంగా వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్లా, ఇంతకన్నా పెద్ద ఇల్లు దొరకకా తనూ పక్కింటి పిన్నిగారూ ఈ మధ్య తరగతి వాళ్ళ కాలనీలో వనవాసం చేస్తున్నారు.
తనకి సరికొత్త జాగ్వారు కారు కొనాలని అభిలాష. పిన్నిగారికి ఒక మేడ ప్రస్తుతానికి కొనాలని ఉంది, తాపీగా ఒకటి కట్టించుకోవాలని సంకల్పం. అందులో టెలిఫోను, రేడియో, బొచ్చుకుక్క అవీ ఉంటాయి. అప్పుడే ఆవిడ టెలిఫోనూ రేడియో పెట్టే బల్లల మీద వేసే గుడ్డలు కొనేసి, వాటికి ఎంబ్రాయిడరీ వేసింది. కొనబోయే బొచ్చుకుక్కకి ముచ్చటైన పటకా, గొలుసు కొని అట్టే పెట్టుకుంది. సుందరమ్మ పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో, చూసి చదివి తెలుసుకుంది.
డ్రైవరు వచ్చి తలుపు తీసేదాకా దిగకుండా ఉండటం, దిగినపుడు ముందర ఓ కాలు వయ్యారంగా నేలమీద మోపడం, మోపినప్పుడు కాలి ఆకుజోడు పూర్తిగా తొడుక్కుని ఉండకుండా, బొటనవేలికి సుతారంగా తగిలించి, అరికాలికి, జోడు ఉపరి తలానికి మధ్య కనీసం అరవై డిగ్రీల కోణం ఉండేటట్లు చూసుకుని మరీ దిగడం, తలుపు వేసినప్పుడు చీర చెంగు ఆ సందులో పడేటట్లు వదిలి, ఆపైన ముద్దుగా ముచ్చటగా సన్నంగా చక్కగా 'ఓ 'అని ఇంగ్లీషులో ఆశ్చర్యపడి, నాజూకైన బేజారు నటించడం మొదలైన కార్య కలాపాలన్నీ, సినిమాలకు వెళ్ళినప్పుడు టాక్సీలలో ఎక్కి దిగి నేర్చుకుంది అందమైన సుందరమ్మ.

వేట, 1950
"అయిడియాలూ వంకలూ ఏ మాత్రం ఉన్నట్టు ?" "నాదగ్గర డజను ఉన్నాయండి. మా యాడదానికి పురుడు, అత్తగారికి ప్రాణ గండం, మీ తమ్ముడుగారికి ఫీజు, మేష్టారిల్లు వేలం, మీ బాబాయిగారి ప్రమోషన్ కి అర్జంటుగా లంచం, రెండు టెలిగ్రాఫులు, టెలిగ్రాఫుల్లాంటి ఉత్తరాలు రెండు .... "
కన్ను పొడుచుకున్నా ఎక్కడా ఒక్క అప్పు కనపడటం లేదు. అప్పులాళ్ళ నిజరూపంలా దారికి అటూ ఇటూ మర్రిచెట్లు జుట్లు విరబోసుకుని వికృతంగా కనిపిస్తున్నాయి.
ఎంతో ఆప్యాయంగా, తమతమ శిల్ప సంప్రదాయాల ప్రకారం లొట్టలు వేస్తూ ఎరని చూస్తున్న పులిని చూస్తున్న వేట గాణ్ణి చూస్తున్న ఎరనీ పులినీ వేట గాడినీ చూస్తున్న పులిని చూస్తున్న వేటగాడిని చూస్తున్న, ఎరని మేస్తున్న పులిని కాస్తున్న ఆయొక్క సన్నివేశంనేత్రానందంగా, మహోజ్వలంగా ఉంది.

మహారాజూ యువరాజూ, 1950
అతన్ని ఎరగని కొత్తవాళ్ల దగ్గర ,అతను భోజనం చేసి ఎన్నాళ్ళయిందో అడిగి చెప్పించి అవతలవాడిని హడలగొడుతుంటారు. నిజానికి ఒకటో తారీకున జీతంకన్నా పద్దెనిమిదో తారీకున దొరికే ఒక్క రూపాయి అప్పు ఇచ్చే ఆనందం ఈ లోకంలో మరేదీ ఇవ్వలేదని ఆయనకు తెలుసు .

అర్ధాన్వేషణం, 1956
ఒక నరసన్న మాస్టారి జీతం ఎంతో పబ్లీకున చెప్పుకోక పోయినా ,రూపాయికి రెండు అర్ధరూపాయిల బదులు కనీసం మూడు ఇప్పిస్తే, ఈపూటా ఆపూటా అట్టే ఇబ్బంది లేకుండా కాలక్షేపం చెయ్యవచ్చునంటే సరిపోవచ్చు.
నరసన్నగారికి ఒళ్ళు మండిపోయింది. పెంకె భడవా హన్నా అనుకున్నాడు. తిన్నగా వీధి కుళాయి దగ్గరకెళ్ళి పొట్టపూటుగా నీళ్లెక్కించేశాడు. అక్కడితో కడుపులో కాముడు ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరై నోరుమూసుకున్నాడు.

రాజకీయ బేతాళ పంచ వింశతిక, 1961
ఆంధ్రప్రభ వారపత్రిక సీరియల్
"కావలిస్తే ఊరు చుట్టూ కందకం తవ్వించి ,కోటగోడలు కట్టేసి పెరక్కుండాచేస్తాగాని దీన్ని మునిసిపాలిటీ చెయ్యనివ్వను . "అన్నాడు సెట్టి . ఈ ఎన్నికల్లో ఇద్దరూ మహా దుష్టులే అయినా తాను ఓటు చేసి తీరాల్సిన దుర్గతి పట్టినందుకు అతను ఏడ్చాడు . ఇద్దరు వెధవల్లోనూ ఓటువల్ల ఎవడో ఒక్కడే ఎన్నిక అవుతున్నాడు కదాఅని ఆనందంతో ఉప్పొంగిపోయి పకాలున నవ్వాడు .

ఊసరవెల్లి కథ
"ఇప్పుడు మెంబరు గిరీ దేస్సేవకే ఇంత రద్దీ అయితే ఇహ రేపు మినీస్ట్రు గిరీ మార్కు దేస్సేవ కెంతయ్యేనూ అని", అన్నారు రెడ్డిగారు. "శానా ఉన్నాయిగా, సెంట్రలు దేస్సేవా, రాష్ట్రాల దేస్సేవా, మున్సిపాలిటీ దేస్సేవా, పంచాయితీ దేస్సేవా, కమిటీ దేస్సేవా మళ్ళీ రెండోవరసలో డిప్యూటీ దేస్సేవా - సదురుకోవచ్చుగా", అన్నాడు సుబ్బరాజు నవ్వి.