"జననం తప్ప మరణం ఎరగని రాతలతో గీతలతో అద్భుత కల్పనల మహేంద్రజాలాన్ని మన మనోవీధుల్లో నిర్మించి కాలంలోని జీవితాన్ని ఫ్రీజ్ చేసి అనంతాన్ని ఆసన్నం చేసే కళాతపస్వులు,మహానుభావులు వాళ్ళు."
-కె.సదాశివరావు
"ఒకడు పేదరికపు పద్మవ్యూహాన్నీ,శైశవపు విశ్వరూపాన్నీ ఛేదించి ఏడ్పించి చూపించి నవ్వించి మన మనోరాజ్యాన్ని కొల్లగొడితే మరొకడు నవ్వుల బాణాలతో ఓడించి మనందరిచేతా కిరీటాన్ని పెట్టించుకున్నాడు."
- కె సదాశివరావు
"వాల్మీకికీ వాల్ట్ డిస్నీకీ వారధులు వాళ్ళే మానవత్వపు మంచిగంధానికి స్నేహ పరిమళాన్ని రంగరించి కుసుమకోమలమైన ఆటలాడే కొంటె మనసులు అప్పుడప్పుడూ అందర్లాగే మామూలు మనుషులు సమయం దొరికినప్పుడు కృష్ణా రామా అనుకుంఛూ ఉంఛారు."
- కె సదాశివరావుి
"బాపుతో జట్టు కట్టకముందే రమణగారు కొన్ని చిత్రాలకు కథ సంభాషణలు సమకూర్చారు. సాక్షి నుంచి శ్రీరామరాజ్యం వరకూ బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలలో బాపు సగమైతే,తాను మరో సగమయ్యారు."
"రమణ స్క్రిప్ట్ లో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావటం."
"ఆస్తికులంతా మంచివాళ్ళూ కారు,నాస్తికులంతా చెడ్డవాళ్లూ కారు- అని రమణ బుద్ధిమంతుడు కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది."
"రమణగారి సంభాషణలు ఎంత సహజంగా,ఎంత పదునుగా,ఎంత హాస్య స్ఫోరకంగా ఉంటాయో నిరూపించే చిత్రం బుద్ధిమంతుడు."
- భరణి
"తమిళంలోని సొగసులు, నుడికారాలు రమణ ఒడిసి పట్టుకున్నారు. 'ఆలమందలు కుండపోతగ పాల వర్షం కురిసినట్లు' తెలుగు ఆడపడుచుల సొగసరితనం, నోముల పంటగా వెళ్లి విరిసేటట్లు అనువాదం సాగింది."
- డా. ఆర్ ఎ పద్మనాభరావు, ఎస్ వి బి సి
"మాటలు రాయటంలో హాస్యం,వ్యంగ్యం ,చమత్కారం గుప్పించి మెప్పించిన రమణగారిలో పాటలు రాసే పాటవం చాలామందికి తెలియదు. సినిమాలలో ఒకటి రెండు పాటలు రాసి మేల్ మేల్ అనిపించుకున్నా పాటల సామ్రాజ్యంలో పీట వేయించుకోలేదు."
- బినిమ్
"బాపు గీతను చూసినా, రమణ రాతని చదివినా పెదాలపై అలవోకగా చిరునవ్వు, కళ్ళల్లో అకస్మాత్తుగా మెరిసే ఓ మెరుపు, పక్కనున్న వాళ్ళతో పంచుకోవాలన్న తాపత్రయం నిత్యమై శాశ్వతమై పోతాయి."
- నండూరి రాజగోపాల్, చినుకు సంపాదకుడు
"హాస్యమందున అఋణ -అందె వేసిన కఋణ బుడుగు వెంకట రమణ - ఓ కూనలమ్మ !"
- ఆరుద్ర
"టన్నులకొద్దీ నవ్వుల నెన్నైనా పంచగలుగు నీచేతులలో పెన్నుకు ముదిమియె రాదట విన్నావా ముళ్ళపూడి వెంకట రమణా "
- 'సరసి 'కార్టూనిస్టు
సరసిజ మగునట్టి చక్కని పద్యమ్ము చదివి రమణ చాల సంతసించె పొగడ దండ వేయ పొంగని వాడెవడు పొగడు వాని పొగడ బ్రహ్మ తరమె !'
- సరసిగారికి రమణగారి సమాధానం
"సీతా కల్యాణం కథలో పాణిగ్రహణం ఆంతర్యాన్నీ, తత్త్వాన్నీ చెప్పిన విధానం మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. సార్వకాలీనమూ, సార్వజనీనమూ అయిన మధురోహ, అనుభూతి, వధూవరుల మధ్య జనించి తరంగితమై సాగే అనురాగ ప్రసార మాధ్యమంగా ఆ కర గ్రహణాన్ని విశదీకరించటం - కథాశిల్ప పరాకాష్ఠకు ఉదాహరణ. అక్షర లాలిత్యం, భావ మాధుర్యం జమిలిగా సాగిన సీతాకల్యాణం, తెలుగు కథావనంలో విరగ కాసిన ఒక మధుర రసాల సాలం!"
- 'విహారి'
"రమణ సృష్టించిన అన్ని పాత్రలలోనూ అగ్రగణ్యుడు బుడుగు. తెలుగువారు మాత్రమే ఎంజాయ్ చేయగలిగిన భాష బుడుగుది. ఇతర భాషల్లోకి అనువదింప బడటానికి వీలు పడనిది బుడుగు. తెలుగువారికి మాత్రమే బుడుగు చదివే అదృష్టం ఉంది. చదవండి. మళ్ళీ చదవండి. పిల్లలకు చదవడం రాకపోతే చదివి వినిపించండి. వాళ్ళ చిరునవ్వుల్లో మీ బాల్యాన్ని వెతుక్కోండి."
- ఎం. బి. ఎస్. ప్రసాద్