About Mullapudi
About Bapu
 

ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం లో 1931 లో పుట్టిన ముళ్ళపూడి-తన బతుకూ, దానికి తెరువూ కూడా రచనే అని నమ్మి- అందుకు గమ్యమైన చెన్న పట్నానికి తల్లి తో పాటు వలస వెళ్లారు. 1945 లో బాపుతో చెయ్యి కలిపారు. ఆంధ్ర పత్రికలో చేరి, రచనా దీక్ష ఆరంభించి, అచిరకాలంలోనే తన విలక్షణమైన రచనా శైలితో సాహితీ ప్రియులందరికీ అత్యంత ప్రేమ పాత్రులైనారు.

"బాపూ రమణల కలయిక తెలుగు వారి అదృష్టం" అనిపించే రీతిలో; కష్టం, సుఖం కలబోసుకుంటూ; ఆత్మీయత, ప్రేమ పంచుకుంటూ; స్నేహం, గౌరవం పెంచుకుంటూ; వారిద్దరి అనుబంధం అరవై అయిదేళ్ళు కొనసాగింది. బాపు బొమ్మలు, రమణ రచనలు - అవినాభావ సంబంధంతో పాఠకుల హృదయాలలో ఆత్మీయ స్థానం సంపాదించుకున్నాయి.

స్కూల్ ఫైనల్ తో చదువు ఆపేసిన ముళ్ళపూడి, తన రచనలతో తెలుగు వారి అభిమానం తో బాటు, రెండు విశ్వవిద్యాలయాల డాక్టరేట్లు అందుకున్నారు. సంతకం లేకుండా రాసినా, కలం పేర్లతో రాసినా, "ఇది ముళ్ళపూడి రచనే" అని గుర్తుపట్టేలా రాయటం ఆయనకే చెల్లింది. అలా రాయడం ఆయనకి ఓ సరదా. "మంచి రచనకు అది గీటురాయి" అని నమ్మకం కూడా.

కధలు, నవలలు, వ్యాసాలు, సినిమా రచనలు, అనువాదాలు, జీవిత చరిత్రలు, టీవీ సీరియల్స్, వీడియో పాఠాలు - ప్రక్రియ ఏదైనా, విషయం ఏదైనా- ముళ్ళపూడి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేమ-కోపం, సుఖం-దుఃఖం, సంతోషం-బాధ, సహనం-అసూయ, సంపద-లేమి, గెలుపు-ఓటమి, తృప్తి-ఆకలి, కారుణ్యం-కక్ష... ఈ ద్వంద్వాలన్నిటితోనూ కూడిన జీవితాన్ని పరిశీలించి, పరిశోధించి, మధించి సాధించిన జీవనసారం ఈ కధలు.

జీవితాన్ని ఆసాంతం అమితంగా ప్రేమించి, అనుభవించి, పరిపూర్ణంగా ఆస్వాదించిన ఒక వ్యక్తి, అరవయ్యేళ్ళ నాడు రాసిన ఈ కధలు ఏ నాటికైనా నిలిచే శాశ్వత సత్యాలు. కాబట్టే ఈనాటికీ సజీవంగా ఉండి, నాలుగో తరం పాఠకులను కూడా అలరిస్తున్నాయి.

ముళ్ళపూడి తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం అయితే, బాపు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. ఇద్దరూ కలుసుకున్నది మద్రాసులో. బాలానందంలో. ముళ్ళపూడి స్కూలు చదువు అయిపోగానే సాహిత్యం చదవడం, కథలు రాయడం మొదలుపెట్టారు. పితృవాక్య పరిపాలన కోసం బాపు లా చదివారు గాని తండ్రిగారి అడుగుజాడల్లో హైకోర్టు మెట్లు ఎక్కకుండా బొమ్మలతో తన సొంత దారి వేసుకున్నారు. గీతా వ్యవసాయం చేసి అద్భుతమైన పంటలు పండించారు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ శాశ్వతమైన ఫలితాలు సాధించారు.

చిత్రకళా ప్రపంచంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కార్టూన్లు, కథలకు బొమ్మలు, పుస్తకాలకు, పత్రికలకు ముఖచిత్రాలు, దేవతల బొమ్మలు, గ్రీటింగ్ కార్డులు, వ్యక్తి చిత్రాలు - ఎందులోనైనా గొప్ప చిత్ర కారుల్ని లెక్క పెట్ట వలసి వస్తే మొదటి వేలు బాపుదే. తరువాతి నాలుగు వేళ్ళు కూడా బాపువే.

మొదటి సినిమా సాక్షితోనే తన సొంత ముద్ర వేసుకున్నారు బాపు . అప్పటినుంచి రోజురోజుకూ ఎదుగుతూ బుద్ధిమంతుడు, సంపూర్ణ రామాయణం, అందాలరాముడు, ముత్యాలముగ్గు, భక్తకన్నప్ప, సీతాకల్యాణం, మనవూరిపాండవులు, గోరంతదీపం, వంశవృక్షం, పెళ్ళిపుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీరామ రాజ్యం లాంటి జన రంజకాలైన కళాఖండాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు, తెలుగు ప్రజల హృదయాలలో ఆత్మీయమైన స్థానం సంపాదించారు. హిందీ చిత్ర రంగంలో కూడా ప్రవేశించి మంచి సినిమాలు తీసి ఉత్తరాది ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.

ఈటీవీ భాగవతం, టీటీడీ వెంకటేశ్వర వైభవం నభూతో నభవిష్యతి అన్నట్టుగా తీర్చిదిద్దారు. సత్కారాలకూ, సన్మానాలకూ దూరంగా ఉండే బాపు ఎన్ని తప్పించుకున్నా తప్పనిసరిగా అంగీకరించిన పురస్కారాలు ఎన్నో. రెండు విశ్వ విద్యాలయాల డాక్టరేట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డు , ఫిలిం ఫేర్, ఫిలిం ఫాన్స్అవార్డులు, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన చిత్రకారుడు - ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ చాలదు.

రోజంతా బొమ్మ వేస్తూనో చదువుకుంటూనో గడిపే బాపుగారికి నేపథ్యంలో సంగీతం వినిపిస్తూనే ఉండాలి. వేసిన బొమ్మ మొదట రమణ గారికే చూపించాలి. పుస్తకాల కలెక్షన్ ఎంత ఉందో బాపుగారి దగ్గర,మ్యూజిక్ కలెక్షన్ అంత ఉంది. బొమ్మలు, పుస్తకాలు, సంగీతం, సినిమాలు, రమణగారు - ఈ అయిదింటినీ కలుపుతూ రాముడు బాపుగారిని చేయి పట్టుకుని జీవితమంతా నడిపించాడు. బాపుగారంటే అంతేనా, ఇంకా చాలా ఉంది ...

www.bapuartcollection.com